బిహెచ్ఇఎల్ హైదరాబాద్ యూనిట్ 2010-2011 ఆర్థిక సంవత్సరంలో 6651 కోట్ల టర్నోవర్‌ను సాధించే అవకాశం ఉంది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో భెల్ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన గ్యాస్ టర్బైన్ తయారు చేసి విజయవంతంగా పరీక్షలు పూర్తి చేసింది. 400 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన భారీ ఫ్రేమ్-9 ఎఫ్ఎ టె స్టింగ్ యూనిట్‌లో పరీక్షలు నిర్వహించినట్టుగా కంపెనీ ఇడి కృష్ణన్ తెలిపారు.
ఇంతటీ భారీ గ్యాస్ టర్బైన్ తయారు చేసి రాంచంద్రపూరం యూనిట్‌లోనే ఇది ప్రథమమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. 116 కోట్ల విలువైన 235 మెగావాట్ల మెషీన్ ఒకటి పూర్తయిందని ఆయన తెలిపారు. ప్రతి యేటా నాలుగు భారీ గ్యాస్ టర్బైన్‌లను తయారు చేసే సామర్థ్యం భెల్ (ఆర్‌సిపురం) యూనిట్‌కు ఉందని వెల్లడించారు. రాబోవు ఆర్థిక సంవత్సరంలో 15 వేల మెగావాట్ల సామర్థ్యం గల టర్బైన్‌లను తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు.
బి పి సి ఎల్ విదేశీ విభాగంతో కలసి పనిచేయటానికి గెయిల్ సంసిద్దత వ్యక్తం చేసింది. ముఖ్యంగా మొజాంబిక్ లోని రోవుంబా క్షేత్రం లో వాటా పై శ్రద్ధ చూపిస్తుంది. ఇటీవలే బి పి సి ఎల్ విదేశీ సంస్థ అయిన భారత్ పెట్రో రిసర్వ్స్ ఇక్కడ గ్యాస్ కనుగొన్నది. ఇందులో నామ మాత్రపు వాటా కు కూడా సిద్దం అని గెయిల్ తెలిపింది. దీనిద్వార ప్రస్తుతం గ్యాస్ పంపిణిలో ఉన్న గెయిల్ ఉత్పత్తిలోకి ప్రవేశించినట్లవుతుంది.
తమతో భాగస్వామ్యం వల్ల మౌలిక సదుపాయాలు వేగంగా సమకూర్చుకోవచ్చని మరియు భారత్ కు గ్యాస్ పంపిణి చేయడానికి LNG ద్రవీకరణ సదుపాయం నిర్మించవచ్చని గెయిల్ తెలిపింది. దీనితో బి పి సి ఎల్ త్వరగా లాభాలు పొందవచ్చని తెలిపింది.