ఆటోమొబైల్స్
గత నెల మే లో రెండింతల వృద్దిని సాదించిన" ఆడి "
ఫోక్స్‌వ్యాగన్ గ్రూపుకు చెందిన భారతీయ అనుబంధ సంస్థ ఆడి ఇండియా గత నెల విక్రయాలలో రెండితల వృద్ధిని సాధించి శభాష్ అనిపించుకుంది. మే 2011లో ఆడి విక్రయాలు 104 శాతం వృద్ధి చెంది 408 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు కేవలం 200 యూనిట్లుగా మాత్రమే ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే జనవరి-మే 2011 కాలానికి మొత్తం విక్రయాలు కూడా రెండింతలు పెరిగాయి. ఈ కాలానికి ఆడి ఇండియా మొత్తం విక్రయాలు 1,167 యూనిట్ల నుంచి 2,394 యూనిట్లకు పెరిగాయి. ఓ వైపు ఇంధన ధరలు, వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ కంపెనీ పటిష్ట వృద్ధిని సాధించిందని, తమ డీలర్ భాగస్వాములు మరియు నిజాయితీ గల వినియోగదారుల మద్దతుతో 2011 ఆడి ఇండియా ఓ అనిర్వచనీయమై సంవత్సరంగా మిగిలిపోతుందని కంపెనీ హెడ్ మైఖేల్ ప్రెష్కీ తెలిపారు.
భారతీయులలో పెరుగుతున్నటువంటి అభిరుచికి అనుగుణంగా లగ్జరీ కార్ల పై మోజు పెరుగుతుండడంతో వాటి యొక్క వినియోగం ఎక్కువయ్యింది. దీనితో లగ్జరీ కార్ల అమ్మకాలు పెరిగినాయి . గతంలో భారతదేశంలో రెండు-మూడు లగ్జరీ కార్ల కంపెనీలు మాత్రమే ఉంటే ఇప్పుడు నెలకో కంపెనీ చొప్పున భారత్‌లో తమ దుకాణాలు పెట్టేస్తున్నాయి. పోటీ పోటీగా మోడళ్లను దింపుతూ చౌక ధరలకే వాహనాలను అందిస్తున్నాయి. అయితే ఇంతటి పోటీతత్వ మార్కెట్లో కూడా కొన్ని కంపెనీలు తమ బ్రాండే గ్రేట్ అనిపించుకుంటున్నాయి. అలాంటి బ్రాండ్‌లలో ఆడి కూడా ఒకటి.